విడుదల తేదీ : 24 అక్టోబర్ 2014 | ||
123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5 | ||
దర్శకత్వం : చంద్రశేఖర్ రెడ్డి | ||
నిర్మాత : సుజన్ | ||
సంగీతం : ప్రదీప్ కేకే | ||
నటీనటులు : కిరణ్, ప్రియాంక, రఘుబాబు, ధనరాజ్, కారుమంచి రఘు.. |
కిరణ్, ప్రియాంక జంటగా సప్తవర్ణ క్రియేషన్స్ పతాకంపై సుజన్ నిర్మించిన సినిమా ‘ఐ యామ్ ఇన్ లవ్’. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ప్రదీప్ కేకే సంగీతం అందించారు. ప్రేమ నేపధ్యంలో తెలుగు తెరపై ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. ఎందుకంటే లవ్ అనేది యూనివర్సల్ సబ్జెక్టు. ప్రతి సినిమాలో కొత్త ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులలో ఎటువంటి ఫీలింగ్ కలిగించిందో..? ఒకసారి చూడండి.
కథ :
సినిమా ప్రారంభం అవ్వగానే హీరో కళ్ళముందు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక అమ్మాయిని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వంశీ(కిరణ్) ఇంజనీరింగ్ చదువుతూ రేడియో సిటీ 91.1 యఫ్.యం.లో ఆర్.జె.గా వర్క్ చేస్తుంటాడు. ప్రేమికుల సమస్యలకు మంచి సలహాలిస్తూ లవ్ గురుగా ఫేమస్ అవుతాడు. తన కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావ్య (ప్రియాంక)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత శ్రావ్యకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. శ్రావ్య రిజెక్ట్ చేస్తుంది. తన అభిరుచులు, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతిరోజూ గిఫ్ట్స్ పంపిస్తూ తనను సర్ ప్రైజ్ చేస్తున్న అజ్ఞాత వ్యక్తి కృష్ణను లవ్ చేస్తున్నాని శ్రావ్య చెప్తుంది. కృష్ణ ఎలా ఉంటాడో..? అతను ఎం చేస్తాడో..? క్యారెక్టర్ ఎటువంటిదో..? శ్రావ్యకు తెలియదు. కానీ శ్రావ్య ఓ రోజు సడన్ గా కృష్ణని చంపాలని నిర్ణయించుకుంటుంది.
ఇతరుల ప్రేమకు సలహాలు ఇచ్చే వంశీ, తన ప్రేమ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు..? కేవలం కృష్ణ పంపిన గిఫ్ట్స్ చూసి లవ్ లో పడిన శ్రావ్య.. సడన్ గా కృష్ణను ఎందుకు చంపాలనుకుంది..? కృష్ణను చంపడానికి శ్రావ్యకు హెల్ప్ చేస్తానని వచ్చిన వంశి ఎం చేశాడు..? చివరకు వంశీ, శ్రావ్యల ప్రేమకథ సుఖాంతం అయ్యిందా..? లేదా..? హీరోయిన్ బ్రతికిందా..? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ కథ. నేటి యువతరం ఆలోచనలు, లవ్, ఫ్రెండ్షిప్, ఎఫ్.ఎం లవ్ గురు వంటి పాయింట్స్ టచ్ చేస్తూ రెగ్యులర్ స్టైల్ లో మంచి కథ రాసుకున్నారు. కాలేజీలో తన ఫ్రెండ్ వంశీ, తను అభిమానించే ఆర్.జె క్రిష్ ఒక్కడే అని హీరోయిన్ శ్రావ్యకు తెలిసే సన్నివేశం, క్లైమాక్స్ సన్నివేశం బాగున్నాయి. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రాసుకోవడం వలన సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. ఆడియన్స్ కి లిటిల్ బిట్ థ్రిల్ కలిగించాయి.
కథ కంటే ముఖ్యంగా ప్రదీప్ కేకే అందించిన సంగీతం చాలా చాలా బాగుంది. ‘మెల్లమెల్లగా.. ‘, ‘ఈ సంఘర్షణ.. ‘ పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఆహ్లాదకరంగా సాగుతూ మనసుకు మంచి ఫీలింగ్ కలిగించాయి. మిగతా పాటలు కూడా ఓకే. ఇక, సన్నివేశంలో ఫీలింగ్ ను తన నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు ప్రదీప్. హీరో కిరణ్ కు ఇదే ఫస్ట్ మూవీ. అయినా డాన్సులు, ఫైట్లలో మంచి ప్రతిభ కనబరిచాడు. సెంటిమెంట్, లవ్ సన్నివేశాలలో బాగానే చేశాడు. ఇంకా, చాలా ఇంప్రూవ్ అవ్వాలి. హీరోయిన్ ప్రియాంక శ్రావ్య నటన ఒకే.
మైనస్ పాయింట్స్ :
హీరోయిన్ వేరొకరిని ప్రేమిస్తుందని తెలిసినా హీరో ఆమెతో స్నేహం చేయడం, ఆమె ప్రేమ పొందడానికి ప్రయత్నించడం.. వంటి సన్నివేశాలు ఇప్పటికే చాలా సినిమాలలో చూశాం. మళ్లీ అదే తరహా కథను ట్విస్టులతో చెప్పాలి అనుకున్నప్పుడు సన్నివేశాలు చాలా కొత్తగా ఉండాలి. మెయిన్ లీడ్ తో పాటు ఇతర ఆర్టిస్టుల నటన కథలో ప్రేక్షకులను లీనం చేసేలా ఉండాలి. లేకపోతే, అసలుకే మోసం వస్తుంది. ఈ సినిమాలో జరిగిందదే. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. తర్వాత హీరో తన ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాలు కొంచం కూడా కొత్తగా లేవు.
ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో 10 నిముషాలలో పూర్తయ్యే సినిమాను గంట పాటు సాగదీశారు. సినిమాను కమర్షియల్ గా తీర్చిదిద్దడం కోసం రఘుబాబు, కారుమంచి రఘు, ధనరాజ్ ల స్పెషల్ కామెడీ ట్రాక్స్ రాసుకున్నారు. వారి నటన, ఆ కామెడీ సన్నివేశాలు కొంచం కూడా ప్రేక్షకులను నవ్వించకపోగా, కథకు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డు తగిలాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రఘుబాబు లవ్ గురుగా చేసిన లవ్ ట్రాక్బాగా సాగదీసిన ఫీలింగ్ కలగడంతో ఆడియన్స్ కి విసుగొస్తుంది. ఇలా కామెడీ విసుగు తెప్పించినా కథనం, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ వర్కౌట్ అయ్యి ఆసక్తిగా ఉంటె ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవుతారు. కానీ అవి కూడా మిస్ అవ్వడంతో ఈ ప్రేమకథ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది.
సాంకేతిక విభాగం :
సప్తవర్ణ క్రియేషన్స్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారైనా ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. పాటలను చాలా రిచ్ గా చిత్రీకరించారు. పాటల్లో లొకేషన్స్ బాగున్నాయి. ప్రదీప్ అందించిన సంగీతం గురించి మనం మాట్లాడుకున్నాం. చక్రవర్తి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. విజువల్ గా బెస్ట్ వర్క్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో కత్తెరకు పని చెప్పాల్సిన సందర్భాలు చాలా వచ్చాయి. వాటిని కట్ చేసి సినిమాను షార్ప్ చేయాల్సింది. ఓవరాల్ గా ఎడిటర్ ఉపేంద్ర పర్వాలేదనిపించాడు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వ విభాగాలను నిర్వర్తించిన చంద్రశేఖర్ రెడ్డి ఒక్క అంశంలో మాత్రమే సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే పరంగా పర్ఫెక్ట్ గా రాసుకున్నాదానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు. ప్రేమకథలలో ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వాలి. థియేటర్లో ప్రేక్షకుడు ఆ ప్రేమ అనుభూతిని పొందాలి. అప్పుడే దర్శకుడు సక్సెస్ అయినట్లు. సినిమాలో ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా దర్శకుడు లవ్ ఫీల్ కలిగించలేకపోయాడు. మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. కథ ఆసక్తికరంగా ఉన్నా కథనం చప్పగా సాగడంతో మనలో ఎటువంటి ఫీలింగ్ కలగదు.
తీర్పు :
‘ఐ యామ్ ఇన్ లవ్’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులలో ఎటువంటి లవ్ ఫీలింగ్ కలిగించలేదు. హీరో హీరోయిన్ల నటన పర్వాలేదు అనిపించినా, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా గడిచిపోతుంది. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వపరంగా విఫలం అవ్వడంతో సెకండ్ హాఫ్ లో కీలకమైన సెంటిమెంట్, లవ్, ఎమోషనల్ సన్నివేశాలు వర్కౌట్ కాలేదు. దాంతో ట్విస్టులతో కూడిన మంచి కథ, సంగీతం బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. ఇప్పటికే ఈ తరహా కధాంశంతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సో, కొత్త హీరో హీరోయిన్లతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆదరణ ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
Post a Comment