ఆయాసం నుంచి అనాయాస శ్వాసకు
ఆకలేస్తే అన్నం ప్లేట్లో పట్టుకురావచ్చు. దాహం వేస్తే నీళ్లు గ్లాసులో పట్టుకురావచ్చు. కానీ... ఆస్తమా వచ్చిన వారు ఊపిరాడటం లేదంటూ బాధపడుతుంటే... గాలిని ఎలా  పట్టుకురావాలి? ఈ పరిస్థితిని ఎలా నెట్టుకురావాలి?... దీనికో మార్గం ఉంది. ఇన్‌హేలర్ అనే ఒక చిన్న ఉపకరణం సహాయంతో ఆస్తమా ఉన్నవారికి తేలిగ్గా శ్వాస ఆడేలా చేయవచ్చు. మరి... ఇలా ఇన్‌హేలర్స్ వాడే విషయంలోనూ ఎన్నో దురభిప్రాయాలూ, అపోహలూ రాజ్యమేలుతున్నాయి. ఇన్‌హేలర్స్ వాడటం రోగుల ఆరోగ్యానికి  మంచిదేనా? ఆస్తమా ఉన్నవారికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుందట. మరి డాక్టర్లంతా స్టెరాయిడ్స్ మంచివి కావని అంటుంటారే? అదే నిజమైతే చికిత్సలో భాగంగా ఆస్తమా కోసం స్టెరాయిడ్స్ వాడితే... అవి మరికొన్ని సమస్యలకు దారితీయవా? ఇలాంటి  అపోహలూ, సందేహాలూ సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ ఆస్తమా దినం సందర్భంగా... ఆస్తమాపై ప్రాథమిక పరిజ్ఞానం కోసం ఈ ప్రత్యేక కథనం.

మనలో చాలామందికి మబ్బు పట్టినా, మంచు కురిసినా, వాన ముసిరినా ఊపిరితిత్తులు బిగదీసుకుపోయి శ్వాస సరిగా అందక, ఊపిరి తీసుకోవడం కోసం తహతహలాడిపోతుంటారు. ఇలా ఊపిరికోసం ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితిని ‘ఆస్తమా’ అంటారు. ఈ పరిస్థితి ఒక్కోసారి గంటల కొద్దీ కొనసాగుతూ తీవ్రంగా బాధిస్తుంటుంది. దీన్నే ఆస్తమా ఎటాక్‌గా అభివర్ణిస్తారు.

 ఆస్తమా లక్షణాలు
 ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది.
 శ్వాస కొద్దిగా అందేలోపే ఛాతీ గట్టిగా బిగదీసుకుపోయి పట్టేసినట్లుగా ఉండటం.
 పై పరిణామాల వల్ల కనిపించే తీవ్రమైన ఆయాసం
 దగ్గు
 శ్వాస తీసుకునే సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం.
 ఇతర లక్షణాలు : ఆస్తమా రోగుల్లో ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని అదనపు లక్షణాలూ కనిపించవచ్చు. అవి... ముక్కులు బిగదీసుకుపోవడం, సైనుసైటిస్ లక్షణాల్లోలా ముక్కు నుంచి స్రావాలు కనిపించడం  కొందరిలో ఒంటిపై దద్దుర్లు (ర్యాషెస్), చర్మంపై పగుళ్లు (డర్మటైటిస్) వంటివీ కనిపించవచ్చు.

 పొరబడే అవకాశాలూ ఉంటాయి...
 ఆస్తమాలో కనిపించే ఆయాసం, దగ్గు, పిల్లికూతల వంటి లక్షణాలు ఊపిరితిత్తుల్లో కనిపించే ఇతర రుగ్మతల్లోనూ ఉంటాయి. కాబట్టి ఆస్తమా నిర్ధారణకు రోగచరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం. ఇది ఒక్కోసారి దీర్ఘకాలంగా బాధించే ‘క్రానిక్ ఎయిర్ వే ఇన్‌ఫ్లమేషన్’ అనే రూపంలోనూ కనిపిస్తూ, లక్షణాలు మాటిమాటికీ పునరావృతమవుతుంటాయి. ఒక్కోసారి మనకు సరిపడని పదార్థానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు గాలిపీల్చుకునేందుకు దోహదపడే ఊపిరితిత్తుల నాళాలు సన్నబడిపోయి గాలి స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదపడకుండా అడ్డుపడతాయి. అయితే ఆస్తమా రోగుల్లో కనిపించే సాధారణ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. అందుకే రోగుల్ని కాస్త సావకాశంగా పరిశీలించి, వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

 నిర్ధారణ పరీక్షలు...
 రోగికి ఉన్న వ్యాధి చరిత్ర (మెడికల్ హిస్టరీ)ను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.

 స్పైరోమెట్రీ అనే పరీక్ష ఆస్తమా నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఇందులో రోగి చేత గాలిని ఊదించి, ఆయనెంత బలంగా ఊదుగలుగుతున్నాడనే అంశం ఆధారంగా రోగి వాయునాళాలు ఏమేరకు ముడుచుకుపోయాయన్న విషయం అంచనా వేస్తారు. దీని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్తమా తీవ్రతను నిర్ధారణ చేస్తారు.

 ఇక కొన్ని రకాల ఇన్‌హేలర్స్ సహాయంతో ముడుచుకుపోయిన వాయునాళాలు రిలాక్స్ అయ్యేలా చేయవచ్చు. దీని ఆధారంగా ఒక మందుకు రోగి ఎలా స్పందిస్తున్నాడన్న అంశాన్నీ అంచనా వేస్తారు.

కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు...
ఇటీవల ఆస్తమాను నిర్ధారణ చేయడంతో పాటు, దాని తీవ్రతను తెలుసుకోడానికి ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు ముడుచుకుపోయేలా చేస్తారు. ఇందుకుగాను మిథకోలైన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. లేదా కొందరిలో వ్యాయామం చేయించి అదే ప్రభావాన్ని కల్పిస్తారు. ఇక ‘పీక్ ఎక్స్‌పిరేటరీ ఫ్లో టెక్నిక్’ అనే ప్రక్రియను ఉపయోగించి ఇంట్లోనే ఆస్తమా పరీక్ష చేయించవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఉన్న మరో ఉపయోగం ఏమిటంటే... ఒకవేళ ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటే అది ప్రారంభం కాకముందే కనుక్కోవచ్చు. దీనివల్ల చికిత్సను చాలా త్వరగా మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక పీక్ ఫ్లో ఎంత ఉండాలన్న అంశాన్ని రోగి వయసు, జెండర్, ఎత్తు వంటి అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటిని ఇంట్లో ఉండే  ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.

నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష  
మనం గాలి వదిలే సమయంలో (నిశ్వాసలో) కార్బన్ డై ఆక్సైడ్‌ను వదులుతామన్న సంగతి తెలిసిందే. అయితే ఆస్తమా రోగుల్లో ఇజినోఫిల్స్ అనే తెల్ల రక్తకణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఈ పరీక్షనూ మందులకు వ్యాధి తీవ్రత ఏ మేరకు తగ్గింది, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం (ఇన్‌ఫ్లమేషన్) పాళ్లు ఏమేరకు ఉన్నాయి అని తెలుసుకోడానికి చేస్తారు.

రక్తపరీక్ష  
ఆస్తమాను కనుగొనడానికి ఉద్దేశించిన నిర్దిష్టమైన రక్తపరీక్ష ఏదీ లేకపోయినా... ఆస్తమా వచ్చిన సమయంలో రక్తంలోని ఇజినోఫిల్స్ అనే తరహా తెల్లరక్తకణాలు ఎక్కువగా వృద్ధి చెందినందున వాటికి యాంటీబాడీస్‌గా వెలువడ్డ ఐఈజీ లేదా ఇమ్యునోగ్లోబ్యులిన్-ఈ కణాలు కనిపిస్తాయి. (అయితే మన కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు కూడా ఇదే తరహా కణాలు కనిపిస్తాయి. కాబట్టి సందర్భాన్ని బట్టి అది ఎందువల్ల జరిగిందో క్లినికల్‌గానూ పరీక్షించి, డాక్టర్లు  కారణాలను నిర్ధారణ చేస్తారు). ఇక ఏ ప్రత్యేకమైన పదార్థం వల్ల ఆస్తమా ప్రేరేపితమై ఉండవచ్చన్నది కూడా నిర్ణయించడానికి కొన్ని నిర్దిష్టమైన సెన్సిటివిటీ పరీక్షలు చేస్తారు.

ఎక్స్-రే
వ్యాధి నిర్ధారణలో ఎక్స్-రే పరీక్ష కూడా కీలకమైనదే. అయితే కొన్నిసందర్భాల్లో ఆస్తమా రోగుల ఎక్స్-రే నార్మల్‌గా కూడా ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడు వ్యాధి లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఇతర వ్యాధులేమైనా ఈ లక్షణాలకు కారణం కావచ్చా అన్న విషయాన్నీ చాలా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు...
ఆస్తమా నిర్ధారణలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతేగానీ... ఆయాసం, పిల్లికూతలు అనే రెండు ప్రధాన అంశాల ఆధారంగానే దాన్ని ఆస్తమాగా నిర్ధారణ చేయకూడదు. ఇలాంటి లక్షణాలు గుండెజబ్బులు, క్యాన్సర్, సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), వోకల్ కార్డ్ లకు సంబంధించిన సమస్యలూ ఇలాంటి లక్షణాలనే కనబరుస్తాయి. ఒక్కోసారి ఆస్తమా తీవ్రత తక్కువగానే ఉన్నా రోగికి స్థూలకాయం ఉంటే అప్పుడు లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

ఆస్తమాలో రకాలు...
ఆస్తమాలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని...
వ్యాయామంతో ప్రేరేపితమయ్యేది: కొందరు తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు శ్వాస అందకుండా పోయి, ఆస్తమా మొదలయ్యే అవకాశాలున్నాయి. దీన్నే ‘ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్‌డ్ ఆస్తమా’ అంటారు. (అయితే ఇలా వ్యాయామం చేసేప్పుడు ఊపిరి అందకుండా పోయే పరిస్థితి కేవలం ఆస్తమాలో మాత్రమే ఉండదు. ఊపిరితిత్తుల సమస్య, రక్తహీనత (అనీమియా), గుండెజబ్బులు, కండరాల్లో బలహీనత వంటి అనేక సమస్యల్లోనూ ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అయితే కొందరిలో ఈ లక్షణాలు వ్యాయామం మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే కనిపిస్తే మరికొందరిలో 15 నిమిషాల్లో కనిపిస్తాయి. అయితే విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టిన గంట తర్వాత సర్దుకోవచ్చు. కానీ వాతావరణం చల్లగా ఉంటే పరిస్థితి విషమించవచ్చు).

అలర్జిక్ ఆస్తమా: తమకు సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. ఈ సరిపడని పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఆహారం, దుమ్ము/ధూళి, బొద్దింకలు, పుప్పొడి మొదలైనవి. ఇలాంటి సమయాల్లో లక్షణాల తీవ్రత అన్నది వాతావరణంపైనా ఆధారపడి ఉంటుంది.

అజీర్తి / పులితేన్పులతో వచ్చే జీఈఆర్‌డీ సమస్యతో: కొందరిలో ఆహారం తీసుకున్నప్పుడు వారిలో దాన్ని జీర్ణం చేసే ఆసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా కడుపులో మంట/ఆహారం గొంతులోకి వస్తున్నట్లుగా అనిపించడం వంటి సమస్య కనిపిస్తుంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ) అంటారు.

ఈ జీఈఆర్‌డీ సమస్య కూడా ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించవచ్చు. మరీ ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నిద్రలో ఈ తరహా సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఆస్తమా వల్ల నిద్ర మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు.

ఇతర కారణాలతో...
ఇక పైన పేర్కొన్నవే కాకుండా పొగాకు పొగ వల్ల, కట్టెల పొయ్యి వద్ద వెలువడే పొగ, రంగుల వాసన సరిపడకపోవడం వంటి ఇతర అంశాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్‌ప్లేస్ ఆస్తమా’ అంటారు. వీరికి అదే ప్రదేశంలో ఉన్నప్పటికీ వారాంతంలోగానీ, సెలవు రోజునగానీ ఆస్తమా రాదు. ఇక కొందరిలో కొన్ని మందులు సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు.

ఆస్తమా ఎందుకు వస్తుంది?
మనం శ్వాస పీల్చుకున్నప్పుడు గాలి మన ముక్కు చివరినుంచి ప్రారంభమయ్యే ట్రాకియా అనే గొట్టం ద్వారా మొదలై, ఊపిరితిత్తులు రెండింటిలోకీ వెళ్లడానికి వీలుగా ఈ ట్రాకియా రెండు బ్రాంకియాలుగా చీలుతుంది. అక్కడి నుంచి అనేక శాఖలుగా చీలుతూ ఊపిరితిత్తుల్లోని ఆల్వియోలై అనే గాలిగదుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో ఈ ఆల్వియోలైలు 30 కోట్ల వరకూ ఉంటాయి. ట్రాకియా, బ్రాంకియా, ఆల్వియోలై... వీటన్నింటికీ లోపలివైపున సన్నటి వెల్వెట్ వంటి పొర ఉంటుంది. కంట్లో నలకపడ్డప్పుడు కన్ను ఎర్రబారి, నీరుకారినట్టే... మన ఊపిరితిత్తులకు సరిపడనిదేదైనా లోపలికి ప్రవేశిస్తే ఈ వెల్వెట్ పొర కూడా ఎర్రబారిపోయి, నీరుకారిపోయినట్లుగా అవుతుంది. అక్కడ కన్ను చిన్నగా మారినట్టే... ఇక్కడ వాయునాళాలూ సన్నగా మారతాయి. దాంతో ఊపిరి అందడం కష్టంగా మారి ఆస్తమా ఎటాక్ మొదలవుతుంది.

ఆస్తమా ఎవరెవరిలో ఎక్కువ...?
సాధారణంగా ఆస్తమా వచ్చిన రోగులను పరిశీలిస్తే ఇందులో 75 శాతం మంది ఏడేళ్ల వయసు లోపువారే. దీని ఇండ్లలోని పెద్దవారు పాల ఉబ్బసంగా అభివర్ణిస్తుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో ఇది తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. చాలావరకు ఇది వాస్తవమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒక రేసులో ఉన్న గుర్రాల్లో ఒకటి ముందుగానే కాస్త వెనకబడి పోయిందనుకోండి. అది పూర్తిగా పుంజుకుని ముందుకు రావడానికి అవకాశాలు తక్కువ. అయితే కొందరు పాల ఉబ్బసాన్ని నిర్లక్ష్యం చేసి, వయసు పెరుగుతున్న కొద్దీ అదే తగ్గుతుందిలే అనుకుంటారు. కానీ ఆ సమయంలో చికిత్స అందించకపోతే ఎదుగుదల సమయంలో ఊపిరితిత్తుల్లో వికాసం సరిగా జరగక కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. కాబట్టి పాల ఉబ్బసం అదే తగ్గుతుందనే అపోహ వద్దు. అది ఏ రకమైన ఉబ్బసమైనా చికిత్స తీసుకోవమే మేలు. ఇక వాతావరణ కాలుష్యం, ఏదైనా పడకపోవడం వంటి అంశాలతో ఇటీవల అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆస్తమా కనిపిస్తోంది.

చికిత్స
ఆస్తమా చికిత్సలో దాన్ని ప్రేరేపించే అంశాలకు దూరంగా ఉండటం అన్నది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇందుకోసం... రోగికి ఆస్తమాను ప్రేరేపించే అంశాలను నిర్దిష్టంగా కనుక్కోవడం కూడా చాలా ప్రధానం. ఇందుకోసం ఆస్తమా రోగి తనకు చికిత్స అందించే పల్మునాలజిస్ట్ లేదా అలర్జీ స్పెషలిస్ట్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండటం ముఖ్యం.

ఆధునికమైన మందులు...
ఇప్పుడు ఆస్తమా తీవ్రతను తగ్గించడానికి పీల్చేమందులు (ఇన్‌హేలర్స్/నెబ్యులైజర్స్) కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక నోటి ద్వారా తీసుకునే మందులు సరేసరి. పీల్చే మందుల్లో ఉండే ఔషధం బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి గాలి తేలికగా లోపలికీ, బయటకూ వెళ్లేలా చేస్తుంది. ఇక ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్‌లో వచ్చిన వాపు, మంట, ఎర్రబారడాన్ని (ఇన్‌ఫ్లమేషన్‌ను) తగ్గించే మందులనూ వాడతారు. ఇలా రెండు రకాల ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేసి, ఆస్తమా తీవ్రతను తగ్గిస్తారు. దాంతో రోగికి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. ఇటీవల ఐజీఈ అనే తరహా యాంటీబాడీస్‌తోనూ ఆస్తమాకు చికిత్స చేస్తున్నారు.

చికిత్స ఇంట్లోనా... ఆసుపత్రిలోనా...?
రోగికి చికిత్స చాలావరకు ఇంట్లోనే జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఊపిరి అందక, శ్వాస సరిగా ఆడకుండా పరిస్థితి తీవ్రమవుతుంటే ఆసుపత్రికి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇంట్లో చేసిన చికిత్సల వల్ల రోగికి తగినంత ఉపశమనం కనిపించకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఒక్కోసారి కృత్రిమ శ్వాస ఇవ్వాల్సిన అవసరమూ రావచ్చు.

అందుబాటులోకి రానున్న అత్యాధునిక చికిత్సా విధానాలు :

ఇప్పుడు ఆస్తమా చికిత్సలో మరిన్ని అత్యాధునిక చికిత్సావిధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉదాహరణకు బ్రాంకియల్ థెర్మోప్లాస్టీ అన్నది అలాంటి విధానాల్లో ఒకటి. ఈ విధానంలో బ్రాంకోస్కోప్ అనే పరికరంతోనూ, ప్రత్యేకమైన వైర్ల సహాయంతోనూ ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవహింపజేసే వాయునాళాల్లో ఉష్ణోగ్రతనూ, వేడిమినీ పెంచేలా చేస్తారు. దాంతో వాయునాళాలు పూర్తిగా వ్యాకోచిస్తాయి. ఇటీవల జరుగుతున్న అధ్యయనాల వల్ల ఈ ప్రక్రియ సత్వర ఉపశమనానికి దోహదం చేస్తుందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

 అపోహలూ - వాస్తవాలు
ఆస్తమా మందుల పట్ల, ఈ ప్రక్రియలో ఉపయోగించే ఇన్‌హేలర్ల పట్ల, స్టెరాయిడ్స్ విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో కొన్ని...

 అపోహ : ఆస్తమా నియంత్రణకు ఉపయోగించే ఇన్‌హేలర్లు ఆరోగ్యకరం కావు. రోగులు వీటికి తేలిగ్గా బానిసలవుతారు. (అడిక్ట్ అవుతారు).
 వాస్తవం : ఇన్‌హేలర్లు పూర్తిగా ఆరోగ్యకరం. వీటిని ఉపయోగించడం వల్ల వాటికి ఎవరూ బానిసలు కారు. అవి శ్వాసను పునరుద్ధరించే ప్రాణరక్షకులు.

అపోహ : ఆస్తమా చికిత్సలో రోగికి స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ వాడటం మంచిది కాదని డాక్టర్లే చెబుతుంటారు.
 వాస్తవం : స్టెరాయిడ్స్ కూడా ఒక రకం మందులే. వీటితో వ్యాధిని తేలిగ్గా నియంత్రణలోకి తేవడంతో పాటు, రోగి ప్రాణాలను రక్షించవచ్చు. అయితే స్టెరాయిడ్స్ వల్ల కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్ ఉన్న మాట వాస్తవమే అయినా రోగికి కలిగే ఉపశమనం, వ్యాధినుంచి అవి కలిగించే రక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సైడ్‌ఎఫెక్ట్స్ పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు.

 అపోహ : ఆస్తమా అన్నది ఒక్కోసారి ఎక్సర్‌సైజ్ వల్ల కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి ఆస్తమా వస్తే ఆ వ్యక్తి వ్యాయామానికి పూర్తిగా దూరంగా ఉండాలి.
 వాస్తవం: ఇది పూర్తిగా అపోహ. ఇప్పుడున్న మందులతో ఆస్తమాను పూర్తిగా నియంత్రణలో ఉంచి, మళ్లీ యథావిధిగా వ్యాయామాలు చేయవచ్చు. ఇప్పుడు ఒలింపిక్ అథ్లెట్లలోనూ చాలామంది ఆస్తమా రోగులు ఉన్నారు. అయినా వారి వ్యాధి, వారి ప్రతిభకూ, వ్యాయామానికీ ప్రతిబంధకం కావడం లేదు.

 అపోహ : కొన్ని రకాల ఆహారాలు వ్యాధిని ప్రేరేపించి, రోగి పరిస్థితిని పూర్తిగా దిగజారుస్తాయి కాబట్టి రోగులు కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మానేయాలి.
 వాస్తవం : రోగి... తక్షణం ఆస్తమాను ప్రేరేపించే ఆహారం నుంచి వీలైనంతగా దూరంగా ఉండటం అవసరమే. అయితే ఈ కారణంగా రోగి తనకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం, పండ్లు వంటి వాటిని పూర్తిగా పరిహరించాల్సిన పని లేదు. తన విచక్షణతో ఏ మేరకు తీసుకుంటే తనకు ఇబ్బంది కలగదో, ఆ మేరకు తీసుకోవచ్చు.

 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి

 ఇతర అంశాలనూ  పరిగణనలోకి...  
 ఆస్తమా రోగికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలూ, ఇతర కండిషన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయడం అవసరం. ఉదాహరణకు ఒక మహిళకు ఆస్తమా చికిత్స చేస్తున్నప్పుడు ఆమె గర్భవతా, ఎలాంటి మందులు తీసుకుంటూ ఉంది అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. కడుపులో ఉన్న చిన్నారికీ, తల్లికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చికిత్స ప్రణాళిక రచించుకోవాలి.

 చాలా ప్రాచీనం
 ఆస్తమా అనేది గ్రీకు మాట. ‘నోటితో శ్వాస’ అనేది దాని అర్థం. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు హిపోక్రేటస్ (క్రీ.పూ. 460 - 370) నాటికే ఉన్నట్లు అప్పటి వర్ణనలను బట్టి తెలుస్తోంది.

 ఇప్పుడు అనేక రకాల ఆధునిక చికిత్సా ప్రక్రియలతో పాటు, తక్కువ మోతాదులోనే ఎక్కువ ప్రభావం చూపే అత్యంత సురక్షితమైన ఔషధాలు, ఇన్‌హేలర్లు అందుబాటులోకి వచ్చినందున గతంలోలా ఆస్తమా పట్ల అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

Post a Comment

 
Top