పీహెచ్‌డీ...పది ఫెలోషిప్స్!
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో అత్యుత్తమ ఆవిష్కరణలు జరగాలి. పరిశోధనల ఫలాలను అందిపుచ్చుకున్న ఉత్తర అమెరికా, యూరోప్ దేశాలు ప్రపంచంలోనే అగ్ర పథాన ఉన్నాయి. మన దేశం కూడా ఆయా రంగాల్లో ఇప్పుడిప్పుడే ముందంజ వేస్తోంది. ఇంతటి కీలకమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ కోర్సులు చేయాలనుకునే యువతకు భారీగా స్కాలర్‌షిప్స్/ ఫెలోషిప్స్ అందిస్తోంది. శాస్త్రవేత్తలుగా రాణించాలనుకునే యువత వీటిని అందిపుచ్చుకుని అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు అందిస్తున్న స్కాలర్‌షిప్స్‌పై ప్రత్యేక కథనం...

 1- జాయింట్ సీఎస్‌ఐఆర్ -  యూజీసీ నెట్-జేఆర్‌ఎఫ్

 దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పరిశోధనలు చేయాలనుకునేవారి కోసం నిర్వహించే పరీక్ష జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్. దీన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ప్రతిఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. జూన్, డిసెంబర్‌లలో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా ఏకకాలంలో రెండు ప్రయోజనాలను పొందొచ్చు. అవి.. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికవడం ద్వారా పీహెచ్‌డీ చేస్తూ ఐదేళ్లపాటు ప్రతినెలా ఫెలోషిప్ అందుకోవచ్చు. అదేవిధంగా నెట్ ఉత్తీర్ణత సాధించడం ద్వారా.. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో లెక్చరర్‌గా అడుగుపెట్టడానికి బాటలు వేసుకోవచ్చు.

 పరీక్ష నిర్వహించే సబ్జెక్టులు: కెమికల్ సెన్సైస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్ సెన్సైస్, ఓషన్ అండ్ ప్లానెటరీ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్ సెన్సైస్.

 అర్హత:  55 శాతం(ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో నాలుగేళ్ల బీఎస్/బీఈ/బీటెక్/బీఫార్మ్/ఎంబీబీఎస్/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ఎంఎస్సీ ఉత్తీర్ణత.

 వయోపరిమితి: జనవరి 1, 2014 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, శారీరక వికలాంగులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. లెక్చరర్‌షిప్‌నకు గరిష్ట వయోపరిమితి లేదు. ఏ వయసువారైనా పరీక్ష రాసుకోవచ్చు.

 పరీక్ష విధానం:
 మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది. మొత్తం మార్కులు 200. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రం పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి అనే మూడు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఎ అందరికీ ఒకేలా ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ ఎనాలిసిస్, ఎనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బిలో ఎంచుకున్న సబ్జెక్టుపై కన్వెన్షనల్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇంజనీరింగ్ సెన్సైస్ విభాగం వారికి మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-సిలో సంబంధిత సబ్జెక్టుపై సాంకేతిక భావనలు, సాంకేతిక విజ్ఞానం తెలుసుకునేలా విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తాయి. ఇంజనీరింగ్ సెన్సైస్‌వారికి సంబంధిత సబ్జెక్టులపై సాధారణ ప్రశ్నలు అడుగుతారు. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి.

 పీహెచ్‌డీ: జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్ పరిశోధన సంస్థలు, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీకి అర్హులు.

 ఫెలోషిప్: ఆయా సబ్జెక్టుల్లో అందుబాటులో ఉన్న జేఆర్‌ఎఫ్‌లు, అభ్యర్థుల వయోపరిమితి, నెట్‌లో అత్యధిక మార్కులు, రిజర్వేషన్స్ మొదలైనవాటిని దృష్టిలో ఉంచుకుని జేఆర్‌ఎఫ్‌కు ఎంపిక చేస్తారు. మొత్తం ఐదేళ్లపాటు ఫెలోషిప్ అందిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000తోపాటు కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.20,000 చెల్లిస్తారు. ఈ రెండేళ్లలోపు పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవాలి. లేకుంటే ఫెలోషిప్ తొలగిస్తారు. మూడో ఏడాది నుంచి పీహెచ్‌డీకి నమోదు చేసుకున్నవారికి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(ఎస్‌ఆర్‌ఎఫ్) కింద నెలకు రూ.18,000 అందిస్తారు. వీరికి కూడా ఏడాదికి రూ.20,000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్ చెల్లిస్తారు.

మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు.

 వెబ్‌సైట్: www.csirhrdg.res.in/

 2- ఐసీఎంఆర్ - జేఆర్‌ఎఫ్

 లైఫ్ సెన్సైస్, సోషల్ సెన్సైస్‌ల్లో జేఆర్‌ఎఫ్ పొందాలనుకునేవారి కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్).. జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది.

 మొత్తం జేఆర్‌ఎఫ్‌లు: 150.
 బయోమెడికల్ సెన్సైస్(మైక్రోబయాలజీ, ఫిజియాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, హ్యూమన్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఇన్ఫర్మేటిక్స్, బయోఫిజిక్స్, ఇమ్యునాలజీ, ఫార్మకాలజీ, జువాలజీ, బోటనీ, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, వెటర్నరీ సెన్సైస్)కు 120. సోషల్ సెన్సైస్(సైకాలజీ, సోషియాలజీ, హోమ్‌సైన్స్, స్టాటిస్టిక్స్ ఆంత్రోపాలజీ, సోషల్‌వర్క్, హెల్త్ ఎకనామిక్స్)కు 30 జేఆర్‌ఎఫ్‌లు.
 
అర్హత: 55 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణత.

 వయోపరిమితి: సెప్టెంబర్ 30, 2014 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారు యూజీసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని సంస్థల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో చేరొచ్చు.

 పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి. సెక్షన్-ఎలో సెన్సైస్‌లో జనరల్ నాలెడ్జ్, కామన్ స్టాటిస్టిక్స్, నిత్యజీవితంలో సైన్స్ ప్రభావాలపై 50 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-బిలో ఎంచుకున్న విభాగం(లైఫ్ సెన్సైస్/సోషల్ సెన్సైస్)పై ప్రశ్నలుంటాయి. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సరైన సమాధానానికి ఒక మార్కు.

 ఫెలోషిప్: ఎంపికైనవారికి మొదటి రెండేళ్లు జేఆర్‌ఎఫ్ ఇస్తారు. ప్రతినెలా రూ.16,000 అందిస్తారు. ప్రతిభను బట్టి మూడో ఏడాది నుంచి ఐదో ఏడాది వరకు ఎస్‌ఆర్‌ఎఫ్ ఇస్తారు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.18,000, కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ఐదేళ్లలో ప్రతి ఏడాదికి 20,000 చెల్లిస్తారు. మొత్తం మీద జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్ కలిపి ఐదేళ్లపాటు ఫెలోషిప్ అందిస్తారు.
 పరీక్ష తేదీ: జూలై 13, 2014

 వెబ్‌సైట్: http://icmr.nic.in/jrf.htm

 3- డీబీటీ - జేఆర్‌ఎఫ్


బయోటెక్నాలజీ, అప్లైడ్ బయాలజీల్లో పరిశోధనలు చేస్తూ.. ప్రతినెలా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ) ప్రతి ఏటా బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)ను నిర్వహిస్తోంది.

 అర్హత: బయోటెక్నాలజీ(యానిమల్/వెటర్నరీ/అగ్రికల్చర్/మెడికల్/మెరైన్ /ఇండస్ట్రియల్/ ఎన్విరాన్‌మెంటల్ /ఫార్మాస్యూటికల్ /ఫుడ్/బయోరిసోర్సెస్ /బయోకెమికల్ ఇంజనీరింగ్/బయోసెన్సైస్/బయోఇన్ఫర్మేటిక్స్)స్పెషలైజేషన్‌గా 60శాతం (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) మార్కులతో ఎంఎస్సీ / ఎంవీఎస్సీ /ఎంటెక్/బీటెక్/బీఈ ఉత్తీర్ణత. ఎంఎస్సీ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్, న్యూరో సెన్సైస్ విద్యార్థులూ అర్హులే.

 వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 28ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులు, మహిళలకు వయోపరిమితిలో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. వయోపరిమితికి లోబడి మూడుసార్లకు మించి పరీక్ష రాయడానికి అవకాశం లేదు.

 పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఎలో ఆప్టిట్యూడ్, జనరల్ బయోటెక్నాలజీపై 50 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. పార్ట్-బిలో 200లో ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఏవైనా 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. సరైన సమాధానానికి మూడు మార్కులు. తప్పు సమాధానాలకు 1 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఎంపిక రెండు కేటగిరీల్లో ఉంటుంది.

 కేటగిరీ-1: మొదటి కేటగిరీలో టాప్ 275 మందిని ఎంపిక చేస్తారు. వీరు దేశంలోని ఏ యూనివర్సిటీ/సంస్థలోనైనా పీహెచ్‌డీలో చేరొచ్చు. వీరికి డీబీటీ ఫెలోషిప్ అందిస్తారు.

 కేటగిరీ-2: దీని కింద 100 మందిని ఎంపిక చేస్తారు. వీరు డీబీటీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాజెక్టుల్లో పాల్గొనవచ్చు. వీరు నెట్/గేట్ ఉత్తీర్ణుల మాదిరిగానే ఫెలోషిప్‌నకు అర్హులు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) నిబంధనలు, ప్రాజెక్టు వ్యవధి, సంబంధిత సంస్థల ప్రమాణాల మేరకు ఫెలోషిప్ లభిస్తుంది. వీరికి డీబీటీ ఎలాంటి ఫెలోషిప్ అందించదు.

 ఫెలోషిప్: వ్యవధి ఐదేళ్లు. జేఆర్‌ఎఫ్ కింద మొదటి మూడేళ్లు నెలకు రూ.16,000+హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. ఆ తర్వాత ప్రతిభను బట్టి మరో రెండే ళ్లు పొడిగిస్తారు. ఈ క్రమంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్) కింద రెండేళ్లపాటు నెలకు రూ.18,000+హెచ్‌ఆర్‌ఏ అందిస్తారు. ఐదేళ్లపాటు ఏడాదికి రూ.30,000కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కూడా చెల్లిస్తారు.

 వెబ్‌సైట్: http://nccs.sifyitest.com/BET2014/

 4- ఏఐసీఈ -ఎస్‌ఆర్‌ఎఫ్ (పీజీఎస్)

అగ్రికల్చర్, వెటర్నరీ సెన్సైస్, ఫిషరీ సెన్సైస్, డెయిరీ సైన్స్ అండ్ టెక్నాలజీ.. సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకునేవారి కోసం ఐసీఏఆర్ ప్రతిఏటా జాతీయ స్థాయిలో ఆలిండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (ఏఐసీఈ) నిర్వహిస్తోంది. మొత్తం ఎస్‌ఆర్‌ఎఫ్‌ల సంఖ్య: 202

 అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 21 నుంచి 30 ఏళ్లు.

 పరీక్ష విధానం: 
రాత పరీక్షలో మొత్తం రెండు సెక్షన్లు ఉంటాయి. మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో సెక్షన్-ఏ అందరికీ కామన్‌గా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీలపై 20 ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్-బిలో భాగంగా అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై 180 ప్రశ్నలు ఉంటాయి. 200 ప్రశ్నలకు కలిపి మొత్తం మార్కులు 200.

 ఎస్‌ఆర్‌ఎఫ్: మూడేళ్లపాటు ఎస్‌ఆర్‌ఎఫ్ ఇస్తారు. వెటర్నరీ సైన్స్‌లో ప్రవేశం పొందినవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.14,000, మూడో ఏడాది నుంచి నెలకు రూ.15,000 చెల్లిస్తారు. అగ్రికల్చర్, లైఫ్‌సెన్సైస్ కోర్సుల్లో ప్రవేశం పొందినవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.12,000, మూడో ఏడాది నుంచి నెలకు రూ.14,000 అందిస్తారు. వీటితోపాటు అన్ని కోర్సుల్లో ప్రవేశం లభించినవారికి ఏడాదికి రూ.10,000 చొప్పున కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. రాష్ట్రస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ), నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఆర్‌ఐ), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ ఎడ్యుకేషన్ (సీఐఎఫ్‌ఈ), మణిపూర్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీ-శాంతినికేతన్, నాగాలాండ్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినవారికి మాత్రమే ఎస్‌ఆర్‌ఎఫ్ (పీజీఎస్) ను అందిస్తారు.

 వెబ్‌సైట్: www.icar.org.in

 5- ఇన్‌స్పైర్ ఫెలోషిప్స్

 మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి కోసం ఏర్పాటైన విభాగం.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ). కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ విభాగం ఆర్ అండ్ డీ విభాగాల్లో అడుగుపెట్టాలనుకునే యువతకు ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్‌డ్ రీసెర్చ్ (ఇన్‌స్పైర్) పేరుతో ఫెలోషిప్స్ అందిస్తోంది.

 ఫెలోషిప్స్: ప్రతి ఏటా 1000.

 అర్హత: బేసిక్, అప్లైడ్ సెన్సైస్‌లో పీజీ/ప్రొఫెషనల్ కోర్సెస్(ఇంజనీరింగ్ సెన్సైస్ /మెడికల్ సెన్సైస్/ఫార్మాస్యూటికల్ సెన్సైస్/అగ్రికల్చర్ సెన్సైస్/వెటర్నరీ సెన్సైస్)లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూనివర్సిటీ ప్రథమ ర్యాంకు సాధించి ఉండాలి. లేదా ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ పొంది ఉండి, రెండేళ్ల ఎంఎస్సీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్‌లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీలో చేరి ఉండాలి.

 వ్యవధి: ఐదేళ్లు

 ఎంపిక: రెండు విధాలుగా ఉంటుంది. ముందుగా వచ్చిన దరఖాస్తుల నుంచి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత నిపుణులతో కూడిన కమిటీ వివిధ అంశాల ఆధారంగా ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తుంది.

 ఫెలోషిప్: ముందు రెండేళ్ల కాలపరిమితికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద ప్రతి నెలా రూ.16,000 ఇస్తారు. ఆ తర్వాత ప్రతిభను బట్టి జేఆర్‌ఎఫ్‌ను పొడిగిస్తారు. మూడో ఏడాది నుంచి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్) పేరుతో ప్రతి నెలా రూ.18,000 అందిస్తారు. వీటితోపాటు జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్ పొందినవారికి హెచ్‌ఆర్‌ఏ, ఇతర ఖర్చుల కోసం కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కూడా ఇస్తారు.

 వెబ్‌సైట్: www.inspire-dst.gov.in/

 6- రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్

 మన దేశ యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూషన్స్‌లో సెన్సైస్/ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ/హ్యూమానిటీస్/సోషల్ సెన్సైస్‌లలో ఫుల్ టైం ఎంఫిల్, పీహెచ్‌డీ చదువుతున్న ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఈ ఫెలోషిప్ ప్రదానం చేస్తారు. వీటిని కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ; గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖలు అందిస్తున్నాయి.

 ఫెలోషిప్‌ల సంఖ్య: ఎస్సీ అభ్యర్థులకు: 2000, ఎస్టీ అభ్యర్థులకు: 667.

 అర్హత: సంబంధిత సబ్జెక్టులతో పీజీ ఉత్తీర్ణులై ఉండి యూజీసీ- నెట్, యూజీసీ-సీఎస్‌ఐఆర్ నెట్ జేఆర్‌ఎఫ్‌లకు అర్హత సాధించని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

 ఫెలోషిప్ మొత్తం: మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000. తర్వాత మూడేళ్లు ప్రతి నెలా రూ.18,000 ఇస్తారు. దీనికి అదనంగా కంటిన్‌జెన్సీ ఫండ్, ఎస్కార్ట్స్, రీడర్ అసిస్టెంటెన్స్(వికలాంగ అభ్యర్థులకు), హెచ్‌ఆర్‌ఏ చె ల్లిస్తారు.

 ఫెలోషిప్ వ్యవధి: ఐదేళ్లు.

 ఎంపిక: మెరిట్ ఆధారంగా.

 వెబ్‌సైట్: www.ugc.ac.in/rgnf

 7- మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్

 భారతీయ యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూషన్స్‌లో సెన్సైస్/ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ/హ్యూమానిటీస్/సోషల్ సెన్సైస్‌లలో ఫుల్ టైం ఎంఫిల్, పీహెచ్‌డీ చదువుతున్న ముస్లిమ్, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిస్ట్, పార్శీ అభ్యర్థులకు మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ప్రదానం చేస్తారు.

 అర్హత: 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూజీసీ-నెట్/యూజీసీ-సీఎస్‌ఐఆర్ నెట్ జేఆర్‌ఎఫ్ పొంది ఉండకూడదు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5ల క్షలకు మించి ఉండకూడదు.

 ఫెలోషిప్ మొత్తం: ఎంఫిల్ అభ్యర్థులకు రెండేళ్ల పాటు ఫెలోషిప్ అందజేస్తారు. ఎంఫిల్ చేస్తున్న సమయంలోనే పీహెచ్‌డీకి ఎంపికైతే తర్వాతి మూడేళ్లు కూడా ఫెలోషిప్‌ను కొనసాగిస్తారు. ఎంఫిల్‌లో నెలకు * 16,000. పీహెచ్‌డీలో నెలకు * 18,000. దీనికి అదనంగా కంటిన్‌జెన్సీ ఫండ్, ఎస్కార్ట్స్, రీడర్ అసిస్టెంటెన్స్ (వికలాంగ అభ్యర్థులకు) ఫండ్ కోర్సు ఆధారంగా చె ల్లిస్తారు.

 ఎంపిక: మెరిట్ ఆధారంగా.

 వెబ్‌సైట్: www.ugc.ac.in/manf

 8- జవహర్‌లాల్ నెహ్రూ స్కాలర్‌షిప్స్ ఫర్ డాక్టోరల్ స్టడీస్

 ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, బయోలాజికల్ సెన్సైస్, కంప్యూటర్ సెన్సైస్, ఇంజనీరింగ్ సెన్సైస్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, కంపారిటివ్ స్టడీస్ ఇన్ రిలిజియన్ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, సోషియాలజీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేయాలనుకునే అభ్యర్థులకు జవహర్‌లాల్ నెహ్రూ స్కాలర్‌షిప్స్ అందిస్తారు.

 అర్హత:  60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ప్రథమ శ్రేణిలో ఎంఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణత.
 మనదేశ యూనివర్సిటీ/సంస్థల్లో పీహెచ్‌డీ చదువుతూ ఉండాలి.
 సీఎస్‌ఐఆర్-నెట్/గేట్ స్కోర్ తప్పనిసరి.

 స్కాలర్‌షిప్ వ్యవధి: రెండేళ్లు

 వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 35 ఏళ్లు మించరాదు.

 స్కాలర్‌షిప్ మొత్తం: నెలకు రూ.12,000తోపాటు కాంటిన్‌జెన్సీ గ్రాంట్ క్రింద ఏడాదికి రూ.15,000 చెల్లిస్తారు.

 ఎంపిక: వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

 వెబ్‌సైట్: http://www.jnmf.in/

 10 - సీఎస్‌ఐఆర్-జేఆర్‌ఎఫ్-గేట్ స్కీమ్

 గేట్ ఉత్తీర్ణత సాధించిన ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్ అభ్యర్థులకు సీఎస్‌ఐఆర్-గేట్ జేఆర్‌ఎఫ్ అందిస్తారు.

 అర్హత:  బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోర్/బీఫార్మ్‌లో ఉత్తీర్ణతతోపాటు జీప్యాట్ స్కోర్ ఉండాలి. లేదా బీటెక్ (బయోటెక్నాలజీ)లో ఉత్తీర్ణతతోపాటు గేట్‌లో 85.00 పర్సంటైల్ సాధించి ఉండాలి.
 పీహెచ్‌డీ లేదా ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరి ఉండాలి.
 ఎంఈ/ఎంటెక్ విద్యార్థులు అర్హులు కాదు.

 వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 28 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, శారీరక వికలాంగులు, మహిళలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

 ఫెలోషిప్: మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000, ఆ తర్వాత మూడేళ్లు నెలకు రూ.18,000 చెల్లిస్తారు. వీటితోపాటు ప్రతి ఏటా రూ. 20000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్ అందిస్తారు.

 ఎంపిక: సీఎస్‌ఐఆర్ పరిధిలోని సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా.

 వెబ్‌సైట్: www.csirhrdg.res.in/jrfgate.pdf

 10- యూజీసీ-నెట్

 సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ సబ్జెక్టుల్లో టీచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా, పరిశోధనలు చేస్తూ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకున్నా రాయాల్సిన పరీక్ష యూజీసీ-నెట్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే లెక్చరర్‌షిప్‌కు, జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తారు.

అర్హత: జనరల్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం. మాస్టర్స్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు జూన్ 1, 2014 నాటికి 28 ఏళ్లు మించరాదు. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు యూజీసీ నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. లెక్చరర్‌షిప్‌నకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు.

 95 సబ్జెక్టులకు నెట్: పొలిటికల్ సైన్‌‌స, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాపులేషన్ స్టడీస్, జాగ్రఫీ, కంప్యూటర్ సైన్‌‌స అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సెన్సైస్ వంటి 95 సబ్జెక్టులలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నెట్‌ను నిర్వహిస్తుంది. ఇందులో అర్హత సాధించి అగ్రస్థానంలో నిలిచిన వారికి పరిశోధన దిశగా ప్రోత్సహించేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్)ను ప్రదానం చేస్తారు. జేఆర్‌ఎఫ్ కటాఫ్‌కు దిగువన ఉన్నవారు యూజీసీ నిబంధన ప్రకారం లెక్చరర్‌షిప్‌నకు అర్హులవుతారు. మన రాష్ట్రం విషయానికి వస్తే... ఎక్కువ మంది విద్యార్థులు తెలుగుతోపాటు చరిత్ర, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం, సోషియాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులలో నెట్‌కు హాజరవుతున్నారు.
 నెట్‌లో ఎంపికైతే: నెట్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో తత్సమాన ఇన్‌స్టిట్యూట్‌లలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్ క్వాలిఫై అయి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. ఐఐటీ, ఐఐఎస్‌సీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి నెట్ జేఆర్‌ఎఫ్‌గల వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

డిస్క్రిప్టివ్ నుంచి ఆబ్జెక్టివ్‌కు: నెట్‌లోమూడు పేపర్లు ఉంటాయి. రాత పరీక్ష పూర్తి గా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. అంతకుముందు డిస్క్రిప్టివ్ రూపంలో ఉన్న పేపర్-2, 3లను 2012 జూన్ నుంచి ఆబ్జెక్టివ్ పద్ధతిలోకి మార్చారు. మూడు పేపర్లకు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం పేపర్-1, 2లు, మధ్యాహ్నం పేపర్-3 ఉంటుంది.

 దరఖాస్తు విధానం: www.ugcnetonline.in లేదా www.ugc.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్‌అవుట్ తీసుకోవాలి. దీంతోపాటు బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జతచేస్తూ నిర్దేశించిన చిరునామాకు పంపాలి.

 ముఖ్యతేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 05, 2014.

పరీక్ష తేదీ: జూన్ 29 2014
వెబ్‌సైట్: www.ugc.ac.in

 ఇవేకాకుండా మరెన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రైవేటు సంస్థలు పరిశోధనలు చేయాలనుకునే యువతకు స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రకటనలు జాతీయ పత్రికల్లో వెలువడుతుంటాయి.
 మరిన్ని వివరాలకు... www.ugc.ac.in, www.csirhrdg.res.in,
 http://dbtindia.nic.in, http://dst.gov.in/, www.sakshieducation.com చూడొచ్చు.
 

Post a Comment

 
Top