Latest

09:12 AM RAPIDO CALCULATOR


గల్లా కుటుంబానికి ఘట్టమనేని షాక్!
గల్లా కుటుంబానికి ఘట్టమనేని వారు షాక్ యిచ్చారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఇంటల్లుడిని ఊరించి ఉస్సూరనిపించారు. స్టార్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్న గల్లా జయదేవ్ ఆశలపై ఆయన మామ సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు నీళ్లు చల్లారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన జయదేవ్ సినిమా గ్లామర్ పై ఎక్కువగా ఆధారపడ్డారు. తన అత్తింటివారు చిత్రసీమకు చెందినవారు కావడంతో ఆయన ఆశలు పెట్టుకున్నారు.

తనకు మద్దతుగా కృష్ణ, మహేష్ బాబు ప్రచారం చేస్తారని భావించారు. అయితే జయదేవ్ కు వారు చేయిచ్చారు. ముఖ్యంగా తన బావమరిది మహేష్ తన తరపున ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జయదేవ్ భావించారు. యూత్ లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ తనకు ప్లస్ అవుతుందనుకున్నారు. కానీ ప్రిన్స్ ప్రచారం ఊసే ఎత్తలేదు. తన బావకు ఓటు వేయమని ట్విటర్ లో పోస్ట్ చేసి ఊరుకున్నాడు.

ఇక కృష్ణ కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. చివరి నిమిషంలో విలేకరుల సమావేశం పెట్టి తన అల్లుడికి ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్న తన వియ్యపురాలు గల్లా అరుణకు ఓటేయమని ఆయన చెప్పకపోవడం గమనార్హం. ఇక దర్శకుడు కె. రాఘవేంద్రరావు, మరో సినిమా రచయిత తెర వెనుకుండి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. సొంతవారు రాకపోయినా సినిమావాళ్ల సహకారంతోనే జయదేవ్ ప్రచారం చేసుకున్నారు.
06 May 2014

Post a Comment

 
Top